Balinthalu teesukune ahara niyamalu in telugu balinthalu elanti aharam tinali
పెరుగు తింటే జలుబు చేస్తుందా?
పాలిచ్చే తల్లులు పెరుగు, నారింజ, నిమ్మ వంటి పండ్లరసాలు తీసుకోవడం వల్ల బిడ్డకు జలుబు చేస్తుందని చాలామందిలో నమ్మకం. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. బిడ్డ కొత్త వాతావరణానికి అలవాటు పడే క్రమంలో జలుబు రావడానికి ఆస్కారం ఉంది. వాస్తవానికి పండ్లు, పండ్ల రసాలు తీసుకోవడం వల్ల తల్లిపాలలో విటమిన్ ‘సి’ స్థాయులు తగినంతగా ఉంటాయి. ఫలితంగా బిడ్డకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
పప్పులతో కడుపునొప్పా..
రాజ్మా సెనగపుప్పు, మొలకలు వంటి వాటిని పాలిచ్చే తల్లులు తినడం వల్ల బిడ్డకు కడుపు నొప్పి వస్తుందని చాలా మంది అనుకొంటారు. అందువల్లే వీటితో చేసిన పదార్థాలని బాలింతలకి దూరంగా ఉంచుతారు. ఈ నమ్మకంలో ఏ మాత్రం వాస్తవం లేదు. బాలింతలకి చక్కని పోషకాహారం అంటే ఈ రకం తృణధాన్యాలతో చేసిన పదార్థాలే. వీటిల్లో మాంసకృత్తులు, జింక్, ఇనుము పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బిడ్డకు కడుపునొప్పి, ఉబ్బరం వస్తాయనడం సరికాదు. కాబట్టి నిస్సందేహంగా పప్పుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవచ్చు.
అలాగే బాలింతలు చల్లని నీటిని తాకకూడదని.. వేడివేడి నీటిని తాగిస్తారు. ఇక్కడ వేడినీళ్లు చన్నీళ్లు అని కాదు. ఆ నీరు పరిశుభ్రంగా ఉందా లేదా అన్నదే ముఖ్యం. నీటిని కాచి వడకట్టి.. చల్లార్చి తాగినా ఏం కాదు. వేడినీటినే తాగాలనేది ఒక అపనమ్మకం మాత్రమే. అలాగే నీటిని అతిగా తాగడం వల్ల పాలు పలుచన అవుతాయని, అతిగా తాగొద్దని పెద్దలు సలహాలు ఇస్తుంటారు. ఇందులో కూడా నిజం లేదు. నీటిని బాగా తాగడం వల్ల బిడ్డకు తగినన్ని అంటే 600 నుంచి 800 ఎమ్.ఎల్ పాలు అందుతాయి. ఆపైన నీరు మూత్రం రూపంలో బయటకు పోతుంది. అంతేకానీ తల్లి నీటిని తాగడం వల్ల బిడ్డకందే పాలపై ఎటువంటి ప్రభావం ఉండదు.
బాలింతల ఆహారం పై ఆంక్షలు
నెయ్యి మంచిదేనా
పూర్వపు రోజుల్లో అమ్మాయిలకి చాలా చిన్న వయసులో పెళ్లిళ్లు అయ్యేవి. ఆ వయసులోనే వారు పిల్లలకు జన్మనిచ్చేవారు. ఫలితంగా తీవ్రమైన పోషకాహార లేమి. ఆ సమయంలో నెయ్యిని ఆహారంలో చేర్చడం వల్ల కొంతవరకు శరీరానికి మేలు జరిగేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. పైగా నెయ్యిలో అధిక కెలొరీలు ఉంటాయి. దీనివల్ల అతిగా బరువు పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. తప్పనిసరిగా నెయ్యిని తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే బిడ్డ పుట్టుకతో పచ్చకామెర్లతో బాధపడుతుంటే తల్లి గుడ్డు, మాంసాహారం భుజించకూడదని అనుకొంటారు. నిజానికి మామూలు కామెర్లకు.. పుట్టకతో వచ్చే నియోనేటల్ జాండిస్కి పోలిక లేదు. తల్లి తినే ఆహారం బిడ్డపై ఎలాంటి ప్రభావం చూపించదు. కాబట్టి గుడ్డు ఇతరత్రా పోషకాహారంతోపాటు ఎండు ఫలాలు మితంగా తీసుకోవచ్చు. వీటిలో అధిక కెలొరీలు ఉంటాయి కాబట్టి ఆ మితం పాటించాలి.
పచ్చళ్లకు దూరం..
పచ్చళ్లు, మైదా ఉత్పత్తులు.. బయట అమ్మేవాటికి దూరంగా ఉండాలి. పంచదార, తేనె, జామ్, కేకులు, పేస్ట్రీలు, బిస్కట్లు, పఫ్లు తినడం వల్ల బరువు పెరిగిపోతారు. టీ, కాఫీలు అతిగా తీసుకోవడం వల్ల శరీరానికి ఇనుము అందదు.